వ్యాపారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

0
3

జైపూర్: మండల కేంద్రంలో సమత రైస్ డిపో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బియ్యం విక్రయాల అవుట్‌లెట్‌ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా పౌరసరఫరాల అధికారి, జిల్లా మేనేజర్, మండల తహసీల్దార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో మార్కెట్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బియ్యం వ్యాపారులు, ట్రేడర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు అందుబాటు ధరల్లో బియ్యం విక్రయించాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే అమ్మకాలు జరపాలని ఆదేశించారు.

బియ్యం ధరల నియంత్రణకు రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల అధికారులతో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయని, తనిఖీలకు వచ్చే అధికారులకు వ్యాపారులు, ట్రేడర్లు సహకరించాలని కోరారు .సమత రైస్ డిపో నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం, 26 కిలోల బరువుతో కూడిన బియ్యం బస్తాల ధరలు ఇలా ఉన్నాయి. ప్రీమియం క్వాలిటీ బి.పి.టి. న్యూ రైస్ – రూ.1,352 స్టీమ్ రైస్ – రూ.1,482,పాత బియ్యం – రూ.1,638, హెచ్.ఎం.టి. పాత రకం బియ్యం – రూ.1,950

జై శ్రీరామ్ పాత బియ్యం – రూ.1,976

ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత ధరలకు అందించడమే లక్ష్యంగా అవుట్‌లెట్ ద్వారా విక్రయాలు చేపడుతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. బియ్యం ధరల నియంత్రణతో పాటు సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.