మంత్రులతో నూతన ప్రజాప్రతినిధుల భేటీ – పలాస–కాశీబుగ్గ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

0
1

రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు

పలాస:పలాస–కాశీబుగ్గ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పార్టీ అధ్యక్ష, కార్యదర్శులను కూడా కలిశారు. ముందుగా నియోజకవర్గంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, వాహన శ్రేణులతో తరలివెళ్లారు.

కూటమి అభ్యర్థులకు అఖండ విజయాన్ని అందించిన ప్రజల ఆదరణ, నమ్మకం, సహకారాన్ని ఈ సందర్భంగా మంత్రులకు వివరించారు. ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

నూతన ప్రజాప్రతినిధులతో మంత్రులు ఆత్మీయంగా మాట్లాడారు. ఎన్నికల విజయానికి దోహదపడిన అంశాలను సమీక్షించారు. ప్రజలు కూటమిపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాధాన్యతా అంశాలు, కార్యాచరణ ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు.

పలాస–కాశీబుగ్గను రాష్ట్రంలోనే అత్యంత సుందరమైన, ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని మంత్రులు ఆకాంక్షించారు. ఓట్ల ప్రాతిపదికన రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఈ మున్సిపాలిటీ రెండో స్థానంలో నిలిచిందని, అభివృద్ధిలో మాత్రం రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచేలా సమష్టిగా కృషి చేయాలని సూచించారు.

ఎన్నికల హామీలను దశలవారీగా నెరవేరుస్తూ, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, పట్టణ సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రులు పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా పట్టణ ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.

ప్రజలు అందించిన చారిత్రాత్మక విజయానికి ప్రతిఫలంగా మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని, పలాస–కాశీబుగ్గను రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని నూతన ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి, ATPC చైర్మన్ వజ్జ బాబురావు, నూతన మున్సిపల్ చైర్మన్ గంగాభవాని, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.