నివాస ప్రాంతాల మధ్యనే బాణసంచా దుకాణాలు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమా? లంచాల ఆరోపణల మధ్య అనుమతుల జారీ? పోలీస్, అగ్నిమాపక శాఖల అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం!

0
0

దుండిగల్–గండిమైసమ్మ మున్సిపల్ పరిధిలో భద్రతా నిబంధనలు గాలికి.. ఎక్కడ పడితే అక్కడ దీపావళి బాణసంచా దుకాణాలు!

దుండిగల్–గండిమైసమ్మ మున్సిపల్ పరిధిలో దీపావళి బాణసంచా దుకాణాల ఏర్పాటుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మల్లంపేట్, బౌరంపేట్, గండిమైసమ్మ, దుండిగల్, గాగిల్లాపూర్, కొంపల్లి, బహదూర్‌పల్లి తదితర ప్రాంతాల్లో నివాస ప్రాంతాల మధ్యనే పెద్ద సంఖ్యలో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

బాణసంచా దుకాణాలకు అనుమతులు మంజూరు చేసే ముందు పోలీస్, అగ్నిమాపక శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనలు మరియు భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పరిశీలించాల్సి ఉంటుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో నిబంధనలను పక్కనపెట్టి అనుమతులు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా దుకాణాల అనుమతుల కోసం వేల రూపాయల లంచాలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆరోపణల్లో వాస్తవమెంత? అనుమతులు ఏ ప్రాతిపదికన మంజూరు చేస్తున్నారు? అనే అంశాలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది.

నివాస ప్రాంతాల మధ్య బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల ఏదైనా అగ్నిప్రమాదం సంభవిస్తే భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద విపత్తుకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత పోలీస్, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. అనుమతుల జారీ ప్రక్రియపై విచారణ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రజల ప్రాణాల కంటే బాణసంచా దుకాణాల అనుమతులే ముఖ్యమా? లంచాల ఆరోపణలపై అధికారులు ఎప్పుడు స్పందిస్తారు? ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాతే అధికారులు మేల్కొంటారా?

ఇప్పటికైనా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు స్పందించి ప్రజల భద్రతకు భరోసా కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

శ్రీను రావు పొన్నాల

భారత్ ఆవాజ్ – నేషనల్ మీడియా