పత్తికొండ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా టీచర్ ప్రేమారాంబ ఎన్నికల హామీలు
పత్తికొండ: పత్తికొండ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టీచర్ ప్రేమారాంబ పోటీకి సిద్ధమయ్యారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతూ, తనకు ఒక అవకాశం కల్పించి విలువైన ఓటుతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.
“మన పత్తికొండ – మన పల్లె – మన అభివృద్ధి” అనే నినాదంతో సమగ్ర అభివృద్ధి సాధించి పత్తికొండను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రజల ముందుకు ఏడు ప్రధాన అభివృద్ధి అంశాలను తీసుకువచ్చారు.
1. ప్రజలకు అందుబాటులో గ్రామ పాలన: ప్రజల సమస్యలపై నిరంతర స్పందన, పారదర్శకమైన పాలన, గ్రామసభల ద్వారా ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పత్తికొండ మేజర్ యార్డు అభివృద్ధి, వీధి వ్యాపారులకు ప్రత్యేక మార్కెట్ ఏర్పాటు, రైతు బజార్ పునరుద్ధరణకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
2. స్వచ్ఛమైన తాగునీరు: ప్రతి ఇంటికీ నిరంతర స్వచ్ఛమైన తాగునీటి సరఫరా అందించేందుకు, నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని తెలిపారు.
3. యువతకు ప్రాధాన్యత: క్రీడలు, నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తూ యువతకు ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించి గ్రామాభివృద్ధిలో భాగస్వాములను చేస్తామని పేర్కొన్నారు.
4. మహిళా సాధికారత: మహిళలకు కుటీర పరిశ్రమల ఏర్పాటు, స్వయం ఉపాధి అవకాశాల కల్పన, మహిళా సంఘాల బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.
5. ఆరోగ్యకరమైన పారిశుధ్యం: పిల్లలు, వృద్ధులు, మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ పారిశుధ్య అభివృద్ధి, పచ్చదనం పెంపొందించడం, రహదారుల పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
6. పరిశుభ్రమైన పత్తికొండ: ప్రతి వీధిలో పారిశుధ్య నిర్వహణ, మురుగునీటి సమస్యల పరిష్కారం, వీధుల పరిశుభ్రత, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
7. మెరుగైన రహదారులు: ప్రతి కాలనీకి నాణ్యమైన రహదారులు, దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, అవసరమైన చోట వీధి దీపాల ఏర్పాటు చేపడతామని పేర్కొన్నారు.
ప్రజల అవసరాలను గుర్తించి, వారి సమస్యలకు పరిష్కారం చూపుతూ పత్తికొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన సంకల్పమని టీచర్ ప్రేమారాంబ తెలిపారు. ప్రజల సహకారం, ఆశీర్వాదాలతో పత్తికొండలో అభివృద్ధికి కొత్త బాటలు వేయాలని, తనకు విలువైన ఓటు వేసి ఆదరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.










