మంచిర్యాల: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వ్యవసాయ రంగాన్ని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సమగ్ర నీటి విధానాన్ని అమలు చేయాలని సీపీఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ డిమాండ్ చేశారు.మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నదుల అనుసంధాన ప్రక్రియను చేపట్టి ప్రతి ప్రాంతానికి సాగు, తాగునీరు అందించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కోరారు. మంచిర్యాల జిల్లాలో సాగునీటి కొరతను నివారించేందుకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జిల్లాకు 20 టీఎంసీల సాగునీటిని కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టి పెండింగ్‌లో ఉన్న సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు.వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో వంటి ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే అంచనా వేసి రైతులను ఆదుకునేలా ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. నీటి ఎద్దడిని నివారించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి సాగునీటి వనరులను సమర్థవంతంగా వినియోగించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.కరువు పరిస్థితులను ఆసరాగా చేసుకుని రైస్ మిల్లర్లు, ట్రేడర్లు బియ్యం ధరలను అధికంగా పెంచుతూ సామాన్య ప్రజలపై భారాన్ని మోపుతున్నారని విమర్శించారు. బియ్యం ధరల పెరుగుదలను తక్షణమే నియంత్రించి, కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు పంట నష్టపరిహారం, సాగునీటి సౌకర్యం, అవసరమైన వ్యవసాయ సహాయం అందించడంతో పాటు నిత్యావసర సరుకులను సామాన్యులకు అందుబాటు ధరల్లో అందించాలని ప్రభుత్వాలను కోరారు.అనంతరం ఆయా సమస్యల పరిష్కారం కోరుతూ అదనపు కలెక్టర్ వడాల రాములుకు సీపీఐ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మంచిర్యాల జిల్లా రైతుల సాగునీటి సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, బొల్లం పూర్ణిమ, ఇప్పకాయల లింగయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు కలిందర్ అలీ ఖాన్, కారుకూరి నగేష్, లింగం రవి, దాగం మల్లేష్, మిట్టపల్లి శ్రీనివాస్, రేగుంట చంద్రకళ, చిప్ప నర్సయ్య తదితరులు పాల్గొన్నారు,అలాగే సీపీఐ మండల కార్యదర్శులు కొండు బానేష్, బొంతల లక్ష్మీనారాయణ, వనం సత్యనారాయణ, మేదరి దేవావరం, అందే పురుషోత్తం, దేవి పోచన్న, కామేర దుర్గరాజ్, తిలక్ అంబేద్కర్‌తో పాటు జిల్లా సమితి సభ్యులు, పార్టీ నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు










