రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలి: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

0
2

మంచిర్యాల: ప్రజల ప్రయాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు తక్షణమే పటిష్టమైన చర్యలు చేపట్టాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశించారు.

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ గుడిపేట ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందిన నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. పోలీస్ అధికారులతో కలిసి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సీఐ రవీందర్, హాజీపూర్ ఎస్ఐ కిరణ్ కుమార్‌లతో ప్రమాద వివరాలపై చర్చించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయ రహదారిపై భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రహదారికి ఇరువైపులా పెరిగిన పొదలను తొలగించాలని, వాహనదారులకు ఇబ్బందిగా మారిన పెద్ద చెట్ల తొలగింపునకు అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.అలాగే కల్వర్టులను వెడల్పు చేయడంతో పాటు రాత్రివేళల్లో ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు, వైట్ పెయింటింగ్, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని, అవసరమైన ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని అధికారులకు సూచించారు.

పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాత మంచిర్యాల నుంచి నగర శివారు ప్రాంతాల వరకు రహదారి విస్తరణతో పాటు డివైడర్ల నిర్మాణానికి త్వరలోనే చర్యలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు.అదేవిధంగా లిక్కర్ గోదాం ఎదుట లారీలు, డీసీఎం వ్యాన్లను రోడ్డుకు ఇరువైపులా నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని గోదాం మేనేజర్ వాణి జయలక్ష్మికి సూచించారు. వాహనాల కోసం ప్రత్యామ్నాయ పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.ప్రజల ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడమే లక్ష్యమని, రహదారులపై ప్రయాణించే ప్రతి ఒక్కరి భద్రతకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల జిల్లా ఆర్జీపీఆర్ఎస్ అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.