సర్పంచ్ ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సమరశంఖం!

0
0

వజ్రపుకొత్తూరు మండల క్యాడర్‌కు మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు దిశానిర్దేశం

పలాస: రాబోయే సర్పంచ్ ఎన్నికలే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో రాజకీయ సమరానికి సిద్ధమవుతోంది. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు పిలుపునిచ్చారు.

పలాసలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రగతి భవన్‌లో వజ్రపుకొత్తూరు మండల పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులు, ప్రజల నుంచి వస్తున్న స్పందన తదితర అంశాలపై నాయకులతో చర్చించారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. రాజకీయంగా ఎన్ని అవరోధాలు ఎదురైనా పార్టీ శ్రేణులు అధైర్యపడకుండా ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అని పేర్కొన్న ఆయన.. ప్రతి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. రాబోయే సర్పంచ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పటి నుంచే గ్రామస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్టీ భవిష్యత్ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో మాజీ వైస్ జెడ్పీ చైర్మన్ పాలిన శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు తిర్రి రాజారావు, ఉప్పరపల్లి ఉదయ్ కుమార్, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు దువ్వాడ మధుకేశ్వరరావు, తమ్మినేని శాంతారావు, కర్న శ్రీను, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గ్రామస్థాయి నుంచే ఎన్నికల సన్నద్ధత ప్రారంభించాలన్న సీదిరి అప్పలరాజు పిలుపుతో వజ్రపుకొత్తూరు మండల వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో రాజకీయ కదలిక మొదలైంది.