రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

0
3

భూపాలపల్లి నియోజకవర్గంలోని టేకుమట్ల మండలంలో భూపాలపల్లి ఎమ్మెల్యే  గండ్ర సత్యనారాయణ రావు  పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

వేల్లంపల్లి, బోర్నపల్లి, పెద్దoపల్లి గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాలు, గ్రామ సమైక్య భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. అదే విధంగా గరిమిల్ల పల్లి, రాఘవరెడ్డిపేట, పంగిడిపల్లి, టేకుమట్ల, గుమ్మడవెల్లి, వేల్ల్లంపల్లి, వెలిశాల, వెంకట్రావుపల్లి(b) గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు మెరుగైన పోషకాహారం, సౌకర్యాలు అందించడంతో పాటు గ్రామపంచాయతీ, గ్రామ సమైక్య భవనాల నిర్మాణంతో గ్రామీణ పాలనకు, మహిళా సంఘాల కార్యకలాపాలకు మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

గ్రామాల అభివృద్ధి, మహిళల సాధికారత, రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే  స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో  సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు మండల పార్టీ అధ్యక్షుడు, మండల నాయకులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.