చివరి బంతి వరకు ఉత్కంఠ.. పాక్ పై భారత్ సంచలన విజయం |

0
2

● ఒక్క వికెట్ తేడాతో ఆసియా కప్‌ను ముద్దాడిన యువ భారత్

● 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర

● చివర్లో మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన మోహిత్ ఉల్వా

అల్వాల్,14. చివరి బంతి.. గెలవాలంటే పరుగులు చేయాల్సిందే.. చేతిలో ఒక్క వికెట్ మాత్రమే!

ఇలాంటి ఉత్కంఠభరిత పరిస్థితుల్లోనూ భారత యువ క్రికెటర్లు అద్భుత పోరాట పటిమ ప్రదర్శించారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఒక్క వికెట్ తేడాతో ఓడించి అండర్-19 ఆసియా కప్‌ను కైవసం చేసుకున్నారు.

ఒమన్‌లోని అల్ అమరాత్ మైదానంలో శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన ఉత్కంఠను పంచింది.

తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ జట్టు ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ 107 పరుగులతో శతకం బాదగా, అబ్దుల్ ఖాదిర్ 80, కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ 63 పరుగులతో రాణించారు. భారత బౌలర్లు చివరి దశలో వికెట్లు తీసి పాక్ స్కోరుకు కొంతమేర కళ్లెం వేశారు. 338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలో మంచి భాగస్వామ్యం లభించింది. అయితే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ పాకిస్థాన్ వైపు మొగ్గుచూపింది. కెప్టెన్ లక్ష్య రైచందాని 80 పరుగులతో పోరాడగా, అన్వయ్ ద్రవిడ్ 19 పరుగులు చేశాడు. ఆ తర్వాత వికెట్లు వరుసగా పడటంతో భారత శిబిరంలో ఆందోళన నెలకొంది.

– చివర్లో అదరగొట్టిన మోహిత్ ఉల్వా

ఒక దశలో భారత్ ఓటమి ఖాయమనుకున్న పరిస్థితుల్లో మనల్ చౌహాన్, మోహిత్ ఉల్వా అద్భుతంగా పోరాడారు. మనల్ 32 బంతుల్లో 47 పరుగులు చేసి ఆశలు రేపగా, మోహిత్ ఉల్వా కేవలం 22 బంతుల్లో 43 పరుగులతో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

ఫోర్లు, సిక్సర్లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. చివరి ఓవర్‌లో ఎనిమిది పరుగులు అవసరమైన తరుణంలో భారత యువ ఆటగాళ్లు ఒత్తిడిని అధిగమించి లక్ష్యాన్ని అందుకున్నారు.

చివరి బంతి వరకు సాగిన ఉత్కంఠలో భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 339 పరుగులు చేసి ఒక్క వికెట్ తేడాతో విజయాన్ని అందుకుంది. దీంతో తొమ్మిదోసారి అండర్-19 ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. ఓటమి అంచు నుంచి విజయ తీరాలకు చేరిన భారత యువ జట్టు ప్రదర్శన క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది.

#Sidhumaroju

Alwal