రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

0
0

హాజీపూర్: రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్, హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి-63పై గుడిపేట పెట్రోల్ పంపు సమీపంలో 07-11-2026న జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించారు.ప్రమాదం జరిగిన తీరును, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను హాజీపూర్ ఎస్‌ఐ కిరణ్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్‌లుగా గుర్తించి, అక్కడ ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైన హెచ్చరిక బోర్డులు, రేడియం సూచికలు ఏర్పాటు చేయడంతో పాటు, వాహనాల వేగ నియంత్రణకు తగిన చర్యలు తీసుకునేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, ప్రమాదకర ఓవర్‌టేకింగ్‌ను నియంత్రించేందుకు నిరంతరం వాహన తనిఖీలు చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు.ప్రస్తుతం చలికాలం కావడంతో రాత్రి వేళల్లో, తెల్లవారుజామున పొగమంచు, తక్కువ వెలుతురు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. ముఖ్యంగా జాతీయ రహదారులపై పోలీసుల నిఘాను పెంచడంతో పాటు, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.