వెయిట్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తానంటూ అడ్వాన్స్ వసూళ్లు.. బి. సుధీర్‌పై మోసం ఆరోపణలు! రూ.30 నుంచి 40 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితుల ఆరోపణలు.. అద్దె ఇళ్లు మారుస్తూ తప్పించుకుంటున్నాడని ఫిర్యాదు!

0
1

కీసర: వెయిట్ బ్రిడ్జి ఏర్పాటు చేసి ఇస్తానంటూ పలువురు కస్టమర్లను నమ్మించి, అడ్వాన్స్ రూపంలో లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడుతున్నాడని బి. సుధీర్‌పై బాధితులు ఆరోపిస్తున్నారు.

వెయిట్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తానని, వ్యాపారం ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తానని నమ్మబలికి పలువురి వద్ద నుంచి భారీ మొత్తంలో అడ్వాన్స్ డబ్బులు తీసుకున్నట్లు బాధితులు చెబుతున్నారు. డబ్బులు తీసుకున్న అనంతరం వెయిట్ బ్రిడ్జి ఏర్పాటు చేయకపోగా, తీసుకున్న నగదును తిరిగి చెల్లించకుండా తప్పించుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యవహారంలో ఇప్పటివరకు సుమారు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు బాధితులు నష్టపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని మేడ్చల్–మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు బాధితులు ఉన్నట్లు సమాచారం.

ముఖ్యంగా కీసర, ఘట్‌కేసర్, రాంపల్లి ప్రాంతాల్లో అద్దె ఇళ్లను తరచూ మారుస్తూ బాధితులకు అందుబాటులో లేకుండా తప్పించుకుంటున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, బాధితుల నుంచి తీసుకున్న డబ్బులతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని కూడా పలువురు ఆరోపిస్తున్నారు. 

ఇప్పటికే కీసర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

తమకు న్యాయం చేయాలని కోరుతూ కొందరు బాధితులు ఇప్పటికే కీసర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇప్పించడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

బాధితులు ముందుకు రావాలి

వెయిట్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తానని చెప్పి బి. సుధీర్‌కు అడ్వాన్స్ రూపంలో డబ్బులు చెల్లించి నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే సంబంధిత ఆధారాలతో పోలీసులను సంప్రదించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

లక్షల రూపాయలు చెల్లించి నష్టపోయిన తమకు న్యాయం ఎప్పుడు జరుగుతుందోనని బాధితులు ఎదురుచూస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.