హాజీపూర్: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్లో గల హాజీపూర్ పోలీస్ స్టేషన్ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఫిర్యాదుల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించి, అక్కడికి వచ్చిన బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి, చట్టపరిధిలో సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్ఐ కిరణ్ కుమార్ను ఆదేశించారు.ఫిర్యాదుల స్వీకరణ కేంద్రంలోని రికార్డులను పరిశీలించి, ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ రైటర్, సీసీటీఎన్ఎస్ రైటర్లతో మాట్లాడి కేసుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం, సంబంధిత సమాచారాన్ని అప్లోడ్ చేయడం వంటి అంశాలను సమీక్షించారు. పెండింగ్ కేసుల దస్త్రాలు, నేర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వివరాలపై ఎస్ఐని ఆరా తీశారు.ఈ సందర్భంగా కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, వారిని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు. పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరచూ సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలను పెంపొందించుకోవాలని, స్థానిక సమాచార వ్యవస్థను మరింత పటిష్ఠం చేసుకోవాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు రాత్రి వేళల్లో గస్తీని మరింత సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను సానుకూల దృక్పథంతో విని, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని కమిషనర్ ఆదేశించారు.










