అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ ఇన్చార్జి పరమేశ్వర్‌రెడ్డి
ఉప్పల్: అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు మంజూరు చేస్తూ ప్రజా ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మందుముల పరమేశ్వర్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని తెలిపారు.
మంగళవారం ఉప్పల్‌లోని ఎస్వీఎం హోటల్లో ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి మందుముల పరమేశ్వర్‌రెడ్డితో కలిసి మొత్తం 4,278 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పరమేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని వివరించారు.
ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ, సుమారు రూ.150 కోట్లతో నల్లచెరువు, కాప్రా చెరువు, రామంతాపూర్ పెద్దచెరువు, హెచ్ఎంటీ చెరువుల అభివృద్ధి పనులతో పాటు శ్మశానవాటికల అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కాప్రా–ఉప్పల్ బాగాయత్ ప్రాంతంలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కూడా నిధులు మంజూరైనట్లు వెల్లడించారు.
అలాగే ఉప్పల్ బాగాయత్లో 10 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.100 కోట్ల వ్యయంతో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మరింత వేగవంతమయ్యాయని అన్నారు.
ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి పరమేశ్వర్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు









