● తిరుమలగిరి సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం
● 120 మంది విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
● పాఠశాలలో ట్రాఫిక్ సేఫ్టీ క్లబ్ ఏర్పాటు
అల్వాల్,18:మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించే లక్ష్యంతో తిరుమలగిరిలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో బుధవారం ‘అరైవ్ అలైవ్’ (ARRIVE ALIVE) రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ‘ట్రాఫిక్ సేఫ్టీ క్లబ్’ను ఏర్పాటు చేశారు.పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ ఆదేశాల మేరకు, డీసీపీ ట్రాఫిక్-1 కె. రాహుల్ రెడ్డి, ఐపీఎస్ పర్యవేక్షణలో ట్రాఫిక్ తిరుమలగిరి డివిజన్ ఏసీపీ జి. శంకర్ రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సుమారు 120 మంది విద్యార్థులు పాల్గొనగా, రోడ్డు భద్రత ప్రాముఖ్యతను వారికి వివరించారు.ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్, కార్లలో సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ సిగ్నళ్లు, రోడ్డు సూచికలను పాటించాలని సూచించారు. జీబ్రా క్రాసింగ్ వద్దనే రోడ్డు దాటాలని, పాదచారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని వివరించారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగించడం వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు.
విద్యార్థుల్లో చిన్న వయస్సు నుంచే రోడ్డు భద్రతపై బాధ్యతాయుతమైన అలవాట్లు పెంపొందించడంతో పాటు, వారిని రోడ్డు భద్రతా రాయబారులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పాఠశాలలో ‘ట్రాఫిక్ సేఫ్టీ క్లబ్ – అరైవ్ అలైవ్’ను ప్రారంభించారు. ఈ క్లబ్ ద్వారా విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతో పాటు తోటి విద్యార్థులు, కుటుంబ సభ్యులు, సమాజంలోని ఇతరులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించనున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఫాదర్ మైఖేల్ డిసౌజా, పాఠశాల యాజమాన్యం ప్రతినిధి బ్రిగెట్ పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీసుల చొరవను అభినందించిన వారు, విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంపొందించేందుకు తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఏసీపీ జి. శంకర్ రాజు మాట్లాడుతూ, రోడ్డు భద్రతపై అవగాహన పాఠశాల స్థాయి నుంచే ప్రారంభం కావాలని పేర్కొన్నారు. విద్యార్థులు స్వయంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతో పాటు ఇతరులకు అవగాహన కల్పిస్తే ప్రమాదాల నివారణలో కీలక పాత్ర పోషించవచ్చని తెలిపారు. తిరుమలగిరి ట్రాఫిక్ డివిజన్ పరిధిలోని ఇతర విద్యాసంస్థల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ట్రాఫిక్ సేఫ్టీ క్లబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. ప్రాణాలను కాపాడండి.. రోడ్డు భద్రతా రాయబారులుగా మారండి.
#Sidhumaroju
Alwal









