దేవరశెట్టి మార్కండేయులు విజయానికి సమష్టి కృషి చేయాలి

మందస: మందస మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి దేవరశెట్టి మార్కండేయులును అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ పిలుపునిచ్చారు.
మందసలోని ఎస్.ఆర్. కళ్యాణ మండపంలో బుధవారం ఆయన ఆధ్వర్యంలో కూటమి నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని కూటమి అభ్యర్థి మార్కండేయులుకు మద్దతు ప్రకటించారు.
ఎన్నికల సమయంలో నాయకులు, కార్యకర్తల మధ్య ఎలాంటి విభేదాలు, అపోహలు లేకుండా ఐక్యంగా ముందుకు సాగాలని శివాజీ సూచించారు. అభ్యర్థి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పనిచేయాలని, ప్రజలతో మమేకమై కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని కోరారు. సమష్టి కృషితో మందస పంచాయతీలో కూటమి విజయాన్ని సాధించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మందస మండల పార్టీ అధ్యక్షులు, కూటమి నాయకులు, వైశ్య సంఘ ప్రతినిధులు, వ్యాపార ప్రముఖులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.









