అశ్వారావుపేట పట్టణంలోని నందమూరి కాలనీలో పోలీసులు భారీ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ సూచనతో ఈ కార్యక్రమం చేపట్టారు.అశ్వారావుపేట పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్డెన్ సెర్చ్‌లో మొత్తం 120 ఇళ్లను సోదా చేశారు. అలాగే 54 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 2 కార్ల డాక్యుమెంట్లను తనిఖీ చేశారు. వాటిలో డాక్యుమెంట్లు సరిగా లేని 5 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.అంతేకాకుండా ఒక బెల్ట్ షాపులో తనిఖీలు చేయగా 64 క్వార్టర్ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.ఈ సందర్భంగా నందమూరి కాలనీ వాసులకు పోలీసులు అవగాహన కల్పించారు. గంజాయి, సైబర్ నేరాలు, మైనర్ డ్రైవింగ్, కోడిపందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాల జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు. వాటి గురించి ఏమైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.రాబోయే నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరూ జూద శిబిరాలు నిర్వహించవద్దని, అందులో పాల్గొనవద్దని పోలీసులు స్పష్టం చేశారు. అలా చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరూ గంజాయి బారిన పడకుండా, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉండాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్డెన్ సెర్చ్ కార్యక్రమంలో అశ్వారావుపేట సీఐ, అశ్వారావుపేట ఎస్ఐలు, దమ్మపేట ఎస్ఐ మరియు అశ్వారావుపేట సర్కిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.










