కర్నూలు :
స్వచ్ఛ నగర సాకారానికి కీలక అడుగులు!! కర్నూలును స్వచ్ఛ నగరంగా సాకారం చేయాలనే లక్ష్యంతో నగరపాలక సంస్థ కీలక చర్యలు చేపడుతోందని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. క్లీన్ అండ్ గ్రీన్ సిటీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నగర పరిధిలోని ఖాళీ స్థలాల్లో విస్తరించిన పిచ్చి మొక్కల తొలగింపునకు 27 జెసిబిలతో స్పెషల్ డ్రైవ్‌ను కమిషనర్ ప్రారంభించారు. నగరంలోని ఐదు రహదారుల కూడలి సమీపంలోని పాత ఎస్పీ బంగ్లా వద్ద జెండా ఊపి ఈ స్పెషల్ డ్రైవ్‌కు కమిషనర్ శ్రీకారం చుట్టారు.
అనంతరం బుధవారపేట స్మశాన వాటిక పక్కన, కొత్తపేట ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో విపరీతంగా ఉన్న పిచ్చి మొక్కల తొలగింపును పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.
నగరంలోని ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కల వల్ల పాములు, తేళ్లు, దోమలు పెరిగి ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడుతున్నాయని, పందులు ఆవాసంగా మార్చుకుని పరిసరాలను అపరిశుభ్రంగా మారుస్తున్నాయని, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు వివరించారు.
నగర శుభ్రత, ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తప్పనిసరిగా అమలు చేస్తున్నామని తెలిపారు. విస్తరిత ప్రాంతాల్లో ఖాళీ స్థలాల సమస్య అధికంగా ఉండటంతో ఆయా డివిజన్లకు అవసరమైన మేర జెసిబిలను కేటాయించి, ఒకేసారి శుభ్రత పనులు చేపట్టినట్లు తెలిపారు.
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీ.జీ.భరత్, ఎమ్మెల్యేలు గౌరు చరితరెడ్డి, బొగ్గుల దస్తగిరిల చొరవతో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి 27 జెసిబిలను అందించడం అభినందనీయమని కమిషనర్ పేర్కొన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ నగర లక్ష్యం సాధ్యమవుతుందని, శుభ్రతను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి నగరపాలక సంస్థకు సహకరించాలని పిలుపునిచ్చారు.ఖాళీ స్థలాల యజమానులు స్వచ్ఛందంగా శుభ్రత పాటించకపోతే నగరపాలక సంస్థ చర్యలు తీసుకుని జరిమానాలు విధిస్తుందని, జరిమానా చెల్లించిన తర్వాతనే సంబంధిత భవన నిర్మాణ అనుమతులు, వీఎల్‌టీ, ఆస్తి పన్ను ప్రక్రియలు చేపడతామని కమిషనర్ స్పష్టం చేశారు.
అప్పటివరకు ఆ స్థలాలను కార్పొరేషన్ కార్యకలాపాలకు వినియోగించుకుంటామని వెల్లడించారు.కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగశివ ప్రసాద్, ఎంఈ మనోహర్ రెడ్డి, డిఈఈలు పవన్ కుమార్ రెడ్డి, శ్రీనివాసన్, ఏఈ ప్రవీణ్ కుమార్ రెడ్డి, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
