గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తన కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఎదురవుతున్న సమస్యలను ఉపాధ్యాయుల నుండి అడిగి తెలుసుకున్నారు.
మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును సమీక్షించిన ఎమ్మెల్యే, విద్యార్థులకు నాణ్యమైన భోజనం నిరంతరం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే 10వ తరగతి విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించేలా ఇప్పటి నుంచే ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో పలువురు ఉపాధ్యాయులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎయిడెడ్ పాఠశాలలకు తగిన నిధులు కేటాయించాలని, మౌలిక వసతులు మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని పాఠశాలల్లో పెచ్చులు ఊడి పడుతున్నాయని, మరుగుదొడ్ల కొరత ఉందని, తక్షణమే మరమ్మత్తులు చేపట్టాల్సిన అవసరం ఉందని, అదేవిధంగా పట్టాభిపురం హై స్కూల్ వద్ద గంజాయి బ్యాచ్ అధికంగా ఉండటంతో విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరగా, గంజాయి బ్యాచ్‌ను ఉపేక్షించవద్దని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను చరవాణిలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆదేశించారు.
ఉపాధ్యాయులు తన దృష్టికి తీసుకొచ్చిన అన్ని అంశాలను పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి, సమస్యలకు త్వరలోనే పరిష్కార మార్గం చూపుతామని హామీ ఇచ్చారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్ర విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారని, ఆయన స్ఫూర్తితో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని పాఠశాలలన్నింటిలో సమస్యలను పరిష్కరించి, మెరుగైన వసతులు కల్పించి, విద్యార్థులకు ఉత్తమ విద్య అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తే గణనీయమైన ఫలితాలు సాధ్యమవుతాయని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.
