మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఒక నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
శుక్రవారం తెల్లవారుజామున ఉదయం 6 గంటల సమయంలో డయల్ -100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు అందింది. టెంపుల్ అల్వాల్ లోని శ్రీకృష్ణ రెసిడెన్సి నివాసి, స్వర్ణకారుడైన వరుగంటి సురేష్ కుమార్ తన దుకాణంలో దొంగతనం జరిగినట్టు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే అల్వాల్ పోలీస్ లు అల్వాల్ లోని జిఎన్ఆర్ హాస్పటల్ సమీపంలో ఉన్న మమతా సాయి జువెలరీ దుకాణానికి చేరుకున్నారు.
దొంగలు దుకాణం షట్టర్ పగలగొట్టి లోపలికి ప్రవేశించినట్టు పోలీసులు గుర్తించారు. దుకాణం లోపల గాజు అద్దాలు పగిలిపోయి ఉండడమే కాకుండా, వెండి ఆభరణాల పెట్టెలు చిందరవందరగా పడి ఉన్నాయి. సుమారు 1.4 కిలోల బరువు గల 43 పెట్టెల వెండి పట్టీలను దుండగులు అపహరించినట్టు ప్రాథమిక విచారణలో తేలింది.
మొదటిసారిగా ఘటన స్థలంలోనే FIR:
ఇటీవల పోలీస్ శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. నేరం జరిగిన చోట నుంచే కేసు నమోదు చేసే ప్రక్రియను అల్వాల్ పోలీసులు అమలు చేశారు. బాధితుడి ఫిర్యాదును ఘటన స్థలంలోనే స్వీకరించి, అక్కడికక్కడే కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని బాధితుడికి అందచేశారు. ఈ కేసును అల్వాల్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
#sidhumaroju
