“అల్వాల్ పోలీసుల ఘనత: 18 గంటల్లోనే దొంగను పట్టి, బంగారం రికవరీ!

0
30

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు.

అల్వాల్ ఎస్హెచ్ఓ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. రోబరీ చేసిన దొంగని నేరం జరిగిన కేవలం 18 గంటల లోపే పట్టుకోవడమే కాకుండా, బాధితురాలి నుండి దొంగిలించిన సుమారు 10 లక్షల రూపాయల విలువైన 67 గ్రాముల (6 తులాల) బంగారు ఆభరణాన్ని పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు. దీనితో పాటు నేరానికి వాడిన టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే, ఈ నెల 21వ తేదీ సాయంత్రం పంచశీల ఎన్క్లేవ్ వద్ద 70 ఏళ్ల వృద్ధురాలు పెద్దిరాజు జానకి దేవి మార్కెట్ నుండి ఇంటికి వెళ్తుండగా, వెనుక నుండి ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగుడు ఆమె మెడలోని మంగళసూత్రం గొలుసును బలవంతంగా లాక్కొని పరారయ్యాడు.

ఈ క్రమంలో గొలుసు తెగిపోవడంతో పాటు వృద్ధురాలి మెడకు గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

మరుసటి రోజు మచ్చ బొల్లారం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా తిరుగుతున్న రాజస్థాన్‌కు చెందిన మనోజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను చేసిన నేరాన్ని అంగీకరించడంతో అతని వద్ద నుండి 10 లక్షల విలువైన బంగారాన్ని రికవరీ చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

అత్యంత వేగంగా స్పందించి భారీ విలువ గల ప్రాపర్టీని రికవరీ చేసిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కె. వీరబాబు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ నరసింహారావు, డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, హెడ్ కానిస్టేబుల్ జీవన్ కుమార్, కానిస్టేబుల్ రమాకాంత్ మరియు మహిళా కానిస్టేబుల్ యోగితా సింగ్‌లను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

ప్రజలు ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఒంటరిగా వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎస్హెచ్ఓ ప్రశాంత్ ఈ సందర్భంగా సూచించారు.

#sidhumaroju
Alwal