మహిళల సాధికారతకు అంబేద్కర్ చూపిన మార్గం ఆదర్శం: మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి|

0
13

హైదరాబాద్, మే 7: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం సమాజ అభివృద్ధికి మార్గదర్శకం అన్నారు కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జీ వివేక్ వెంకటస్వామి. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని కొనియాడారు. ముఖ్యంగా మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేక అవకాశాలు కల్పించేలా అంబేద్కర్ ఆలోచనలు, చర్యలు ఉన్నాయని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా రిజర్వేషన్లకు మార్గం సుగమం చేశారని చెప్పారు,తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో మహిళా బిల్లుకు మద్దతు తెలిపిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. తన సతీమణి కూడా మహిళల సాధికారత, సామాజిక చైతన్యం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా విద్యా, సామాజిక రంగాల్లో ముందుకు రావాలని ఆకాంక్షించారు.

అంబేద్కర్ పేరుతో నిర్వహిస్తున్న విద్యాసంస్థల ద్వారా నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు విద్య అందిస్తున్నామని పేర్కొన్నారు.

నాగోల్ బండ్లగూడలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) కార్యాలయంలో జిఎస్ఐ సదర్న్ రీజియన్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో ముఖ్య అతిధి గా పాల్గొన్నారు మంత్రి. ఈ సందర్భంగా జిఎస్ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. తన తండ్రి, మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి ప్రజల సంక్షేమం కోసం జీవితాంతం పోరాడారని గుర్తుచేశారు. అంబేద్కర్ ఆశయ సాధన దిశగా ఆయన ప్రజలకు విశేష సేవలు అందించారని తెలిపారు. ప్రజలకు సహాయం చేయడం, సామాజిక బాధ్యతతో ముందుకు సాగడం వంటి విలువలను తన తండ్రి నుంచే నేర్చుకున్నామని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సేవలు సమర్థవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియాను అరికట్టడంలో అధికారులు మరింత లోతుగా అధ్యయనం చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిఎస్ఐ సేవల పునరుద్ధరణ, అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం వెయ్యి కోట్లకు పైగా నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు.

ప్రస్తుతం వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, చిన్న స్థాయి వ్యాపారాలను పెద్ద స్థాయికి తీసుకెళ్లే దిశగా సహకరిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఐదు లక్షలతో ప్రారంభమైన వ్యాపారాలు నేడు కోట్ల రూపాయల వ్యాపారాలుగా ఎదిగి మరెందరికో ఉపాధి కల్పిస్తున్నాయని తెలిపారు. దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని, అన్ని రంగాల్లో పురోగతికి సహకరించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో జిఎస్ఐ సదర్న్ రీజియన్ డీడీజీ బి. అజయ్ కుమార్ మాట్లాడుతూ, గత 175 సంవత్సరాలుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దేశానికి విశిష్ట సేవలు అందిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా జిఎస్ఐ వెయ్యికి పైగా ప్రాజెక్టులను నిర్వహిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విభిన్న రకాల భౌగోళిక పరిశోధనలు కొనసాగుతున్నాయని చెప్పారు.

జిఎస్ఐ సదర్న్ రీజియన్ ఏడీజీ మరియు హెచ్‌ఓడీ విజయ్ విష్ణుపాంత్ మూగల్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో జిఎస్ఐ సేవలు విస్తృతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరి అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని చెప్పారు. దేశ సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని అంశాలను రాజ్యాంగంలో ప్రతిబింబింపజేశారని పేర్కొన్నారు.

డిక్కీ ఉమెన్స్ వింగ్ జాతీయ అధ్యక్షురాలు అరుణ దాసరి మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం రాత్రింబవళ్లు శ్రమించి రాజ్యాంగ రూపకల్పన చేపట్టారని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగంలో అనేక అంశాలను పొందుపరిచారని చెప్పారు. ముఖ్యంగా దళితులు మరియు వెనుకబడిన వర్గాల పురోగతికి అంబేద్కర్ విశేష కృషి చేశారని కొనియాడారు.

అంబేద్కర్ ఆశయాలను సమాజంలో ముందుకు తీసుకెళ్లడంలో మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి కీలక పాత్ర పోషిస్తున్నారని ఆమె అన్నారు. ప్రజా నాయకుడిగా, మంత్రిగా ఆయన అంబేద్కర్ బాటలో నడుస్తూ సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్నారని ప్రశంసించారు.