విధులలో నిర్లక్ష్యం షోకాజ్ నోటీసులు జారీ

0
3

మహబూబాబాద్ మే 7 : గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవల నిర్వహణలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో నిర్లక్ష్యం జరిగిన నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి రాథోడ్ సంబంధిత ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆసుపత్రిలో విధులు సక్రమంగా నిర్వహించని స్థానిక వైద్యులు, సంబంధిత సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, విధుల పట్ల నిర్లక్ష్యం ఏ స్థాయిలోనైనా సహించబోమని డీఎంహెచ్‌ఓ స్పష్టం చేశారు.

ఆసుపత్రులలో సమయపాలన, రోగులకు మర్యాదపూర్వక సేవలు, మందుల లభ్యత, పరిశుభ్రత వంటి అంశాలలో ఎటువంటి అలసత్వం చూపరాదని, ఉప కేంద్రాలలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని హెచ్చరించారు. విధి నిర్వహణలో అలక్ష్యం చేసిన సిబ్బందిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తుందని డాక్టర్ రవి రాథోడ్ తెలిపారు.