హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టును ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవడంతో రెండో దశ విస్తరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో రెండో దశలోని ఏడు మార్గాలకు తక్షణమే అనుమతులు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ అంశంపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లారు. పీపీపీ మోడల్‌పై కేంద్రం గతంలో లేవనెత్తిన అభ్యంతరాలన్నీ ప్రాజెక్టు ప్రభుత్వ పరమవడంతో పరిష్కారమైనట్లు రాష్ట్రం భావిస్తోంది.
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. మెట్రో మొదటి దశ ప్రాజెక్టులో ఎల్‌అండ్‌టీ సంస్థకు ఉన్న వంద శాతం షేర్లను కొనుగోలు చేయడం ద్వారా ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలుపుతూ.. రెండో దశ పనులకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.
గతంలో మెట్రో రెండో దశ ప్రతిపాదనలకు సంబంధించి కేంద్రం కొన్ని సాంకేతిక అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మొదటి దశ పీపీపీ యాజమాన్యంలో, రెండో దశ ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉండటం వల్ల ఆపరేషన్ పరంగా సమన్వయ లోపం వచ్చే అవకాశం ఉందని కేంద్రం మెలిక పెట్టింది. ఇప్పుడు మొదటి దశ కూడా ప్రభుత్వ పరమవడంతో ఆ అభ్యంతరాలు తొలగిపోయాయి. దీంతో రెండో దశ ఎ, బి భాగాల్లోని ఏడు మార్గాల సమగ్ర ప్రాజెక్టు నివేదికలను తక్షణమే
ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది










