“కాకతీయ శివాలయం ధ్వంసం.. కేంద్రం ఎంట్రీతో తెలంగాణలో కలకలం”|

0
26

హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో 800 ఏళ్ల ప్రాచీన కాకతీయ శివాలయం ధ్వంసం వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

చారిత్రక వారసత్వ పరిరక్షణపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పురావస్తు విభాగం కేసు నమోదు చేయడం ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది.

తెలంగాణకు చెందిన ప్రముఖ హ్యూమన్ రైట్స్ న్యాయవాది ఇమ్మనేని రామారావు నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీకి ఫిర్యాదు చేయడంతో కేంద్ర స్థాయిలో కదలికలు ప్రారంభమయ్యాయి.

1965లోనే ఈ ఆలయ శాసనాలు హెరిటేజ్ శాఖ రికార్డుల్లో నమోదై ఉన్నాయని, అయినప్పటికీ రక్షణ చర్యలు చేపట్టకుండా ఆలయాన్ని ధ్వంసం చేశారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి.

తెలంగాణ హెరిటేజ్ చట్టం సెక్షన్ 30 కింద బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

కాకతీయుల వైభవానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఆలయం వద్ద లభించిన శాసనాలు చారిత్రకంగా ఎంతో విలువైనవిగా నిపుణులు చెబుతున్నారు.

సమీకృత పాఠశాల నిర్మాణం పేరుతో ఆలయ అవశేషాలను తొలగించారని ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సంఘాలు, చరిత్రాభిమానులు, హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రజల నిరసనల మధ్య జిల్లా అధికారులు ఆలయాన్ని అదే ప్రాంతంలో పునర్నిర్మిస్తామని ప్రకటించారు.

పురావస్తు నిపుణులు, శిల్పులతో కలిసి చారిత్రక ఆనవాళ్లు దెబ్బతినకుండా పునర్నిర్మాణం చేపడతామని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటన రాజకీయ, చారిత్రక, న్యాయ పరమైన కోణాల్లో తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది.

#sidhumaroju