హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) తొలి చైర్మన్‌గా సేవలందించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ గుండ చంద్రయ్య మృతి పట్ల మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
జస్టిస్ చంద్రయ్య గారి మరణం న్యాయరంగానికి, ముఖ్యంగా మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే వర్గాలకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ విడుదల చేసిన సంతాప సందేశంలో మాట్లాడుతూ, జస్టిస్ గుండ చంద్రయ్య న్యాయవ్యవస్థలో అత్యున్నత విలువలను పాటించిన వ్యక్తిగా చిరస్థాయిగా గుర్తుండిపోతారని తెలిపారు.
న్యాయమూర్తిగా పనిచేసిన కాలంలో ఆయన అనేక కీలక తీర్పులు ఇచ్చి ప్రజల విశ్వాసాన్ని సంపాదించారని కొనియాడారు.
తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తొలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కూడా జస్టిస్ చంద్రయ్య ప్రజల సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరించారని ఈటల రాజేందర్ గుర్తుచేశారు.
సామాన్య ప్రజలకు న్యాయం అందించాలనే సంకల్పంతో ఆయన పనిచేశారని, ముఖ్యంగా బలహీన వర్గాల హక్కుల పరిరక్షణలో ఆయన చూపిన నిబద్ధత ఆదర్శనీయమని అన్నారు.
న్యాయపరమైన అంశాలపై విశేష పట్టు కలిగిన జస్టిస్ చంద్రయ్య గారు నిష్పక్షపాత ధోరణి, క్రమశిక్షణ, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు.
న్యాయరంగంలో ఆయన చేసిన సేవలు ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు.
జస్టిస్ చంద్రయ్య గారి మృతి వార్త తనను వ్యక్తిగతంగా కూడా తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్న ఎంపీ ఈటల రాజేందర్, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
జస్టిస్ గుండ చంద్రయ్య అందించిన సేవలను తెలంగాణ ప్రజలు, న్యాయవాదులు, న్యాయరంగ ప్రముఖులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.
#sidhumaroju










