మచిలీపట్నంలో మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తన.. ఫోక్సో కేసుకు సిద్ధమైన పోలీసులు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన వివరాలను బాలిక రెండు రోజుల తర్వాత తన తల్లికి చెప్పడంతో విషయం బయటపడింది.
పోలీసుల వివరాల ప్రకారం.. మచిలీపట్నం నిజాంపేట ప్రాంతంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న కుటుంబానికి చెందిన మైనర్ బాలికపై ఇంటి యజమాని అల్లుడు కొన్ని రోజులుగా వేధిస్తున్నట్లు సమాచారం. బాలికను మాయ మాటలతో లొంగదీసుకునేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక పట్ల అతడు అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. అయితే బాలిక అతడి చెర నుంచి తప్పించుకుని బయటకు పరుగులు తీసింది. జరిగిన విషయాన్ని బాలిక శుక్రవారం తన తల్లికి వివరించడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.
తల్లి వెంటనే చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. బాలిక వాంగ్మూలం ఆధారంగా నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.









