“తెలంగాణ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: ఉద్యోగాల వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు!

0
13

హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద తీపి కబురు అందించింది.

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ (నేరుగా భర్తీ చేసే) విధానంలో చేపట్టే వివిధ ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితిని మరో 10 సంవత్సరాల పాటు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో సాధారణ పరిపాలన శాఖ జీవో నెంబర్ 86 (G.O.Ms.No.86) ను అధికారికంగా విడుదల చేసింది.

ఈ నూతన ఉత్తర్వుల ప్రకారం, ఇప్పటివరకు సాధారణ కేటగిరీ అభ్యర్థులకు 34 ఏళ్లుగా ఉన్న గరిష్ట వయోపరిమితిని ప్రభుత్వం 44 ఏళ్లకు పెంచింది. గతంలో ఇచ్చిన వయోపరిమితి సడలింపు గడువు ముగియడంతో సాధారణ వయోపరిమితి మళ్లీ 34 ఏళ్లకు చేరింది,

కానీ నిరుద్యోగుల నుంచి వచ్చిన అనేక విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఈ సడలింపును ఇస్తూ నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పేరిట విడుదలైన ఈ జీవో ప్రకారం, పెంచిన ఈ 44 ఏళ్ల వయోపరిమితి ఉత్తర్వులు విడుదలైన తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు మాత్రమే అమలులో ఉంటాయి.

ఈ ఏడాది కాలంలో వివిధ నియామక సంస్థల ద్వారా వెలువడే అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లకు ఈ నిబంధన వర్తిస్తుంది. దీనికి తోడు, నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఇతర రిజర్వ్‌డ్ కేటగిరీల అభ్యర్థులకు లభించే అదనపు వయోపరిమితి సడలింపులు ఈ 44 ఏళ్లకు అదనంగానే వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ నిర్ణయం సుదీర్ఘకాలంగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ, వయోభారంతో ఆందోళన చెందుతున్న లక్షలాది మంది నిరుద్యోగులకు ఒక గొప్ప సువర్ణావకాశంగా మారనుంది.

అయితే, ఈ 10 ఏళ్ల వయోపరిమితి పెంపు సడలింపు అన్ని విభాగాలకు వర్తించదు. శారీరక ప్రమాణాలు అవసరమయ్యే పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, మరియు అటవీ శాఖ (యూనిఫార్మ్డ్ సర్వీసెస్) ఉద్యోగాలకు ఈ వయోపరిమితి పెంపు వర్తించదని ఉత్తర్వులలో ప్రత్యేకంగా పేర్కొన్నారు.

#Sidhumaroju