పాలమూరు-రంగారెడ్డి భూసేకరణ వేగవంతం చేయండి: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
భూసేకరణ నిధులు, పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. జిల్లా మంత్రులు నిరంతరం అధికారులతో సమీక్షలు జరుపుతూ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి మరియు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.










