పోలవరం అడవుల్లో పులి సంచారం: అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు
పోలవరం జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. చికిలింత పంచాయతీలో పులి దాడిలో 9 దూడలు మృతి చెందడంపై డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తిమ్మాపురం రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉన్న పులిని సురక్షితంగా బంధించాలని అధికారులను ఆదేశించారు.
పులి కదలికలను కనిపెట్టేందుకు డ్రోన్లు, ట్రాప్ కెమెరాలతో 24 గంటల నిఘా ఏర్పాటు చేయాలన్నారు. నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక ‘హనుమాన్’ బృందాలను రంగంలోకి దించాలని, పీసీసీఎఫ్ స్థాయి అధికారి ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. అలాగే, పశువులను కోల్పోయిన రైతులకు తక్షణ పరిహారం అందించాలని మరియు అటవీ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.










