మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సులభంగా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితం గడపాలనే ఆశ, మత్తుకు బానిస కావడంతో నలుగురు యువకులు నేరాల బాట పట్టి చివరకు పోలీసుల చేతికి చిక్కారు. ఎల్లమ్మబండ ప్రాంతానికి చెందిన ఈ యువకులు ఆటోలు నడుపుతూ, వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నప్పటికీ జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
గత నెల రోజులుగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా, ఒంటరిగా వెళ్తున్న వారి మెడల్లోని బంగారు గొలుసులను లాక్కొని పరారవుతూ వచ్చింది. వరుస ఘటనలతో ఆందోళన చెందిన బాధితులు పోలీసులను ఆశ్రయించగా, కేసులు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఘటన స్థలాల పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితుల కదలికలను గుర్తించి వారి జాడను కనిపెట్టారు.
పక్కా సమాచారంతో చేపట్టిన ఆపరేషన్‌లో నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దోచుకున్న బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను కుత్బుల్లాపూర్ డీసీపీ కోటి రెడ్డి జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన జీడిమెట్ల పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
#sidhumaroju









