గుంటూరు జిల్లా వడ్లమూడిలోని డీవీసీ ఆసుపత్రి వైద్యులు ఓ మహిళకు అరుదైన బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన కోటేశ్వరమ్మ మెదడులో, శరీర కదలికలను నియంత్రించే సున్నితమైన భాగం వద్ద ట్యూమర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సాధారణ మత్తు ఇస్తే నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉండటంతో, ఆమెను మెలకువగా ఉంచి ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు.
వైద్య పరిభాషలో ‘అవేక్ క్రేనియోటమీ’గా పిలిచే ఈ చికిత్స సమయంలో రోగి భయపడకుండా ఉండటానికి ఆమె అభిమాన నటుడు పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమాను చూపించారు. కోటేశ్వరమ్మ సినిమా చూస్తూ వైద్యులతో మాట్లాడుతుండగానే, న్యూరో సర్జన్ డాక్టర్ అరుణ్‌కుమార్ బృందం మెదడులోని గడ్డను సురక్షితంగా తొలగించింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు.









