BHARAT AAWAZ న్యూస్
పోలీసునని నమ్మించి కారు కాజేసిన యువకుడు
కళ్యాణదుర్గం, తాను పోలీసు శాఖలో ఎస్.ఐ.నని నమ్మించి అద్దెకు తీసుకున్న కారును తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన యువకుడిని కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చల్లాపల్లి గ్రామానికి చెందిన గంటప్పగారి అనిల్‌కుమార్ (27)ను సోమవారం బోరంపల్లి గ్రామ బస్‌స్టాప్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం మేరకు.. జస్ట్‌డయల్ యాప్ ద్వారా కారు యజమాని జి.మనోహర్‌ను సంప్రదించిన అనిల్‌కుమార్, తాను పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్నని చెప్పి నమ్మించాడు. వాట్సాప్ ద్వారా పోలీసు యూనిఫాం ధరించిన ఫొటోలను పంపి విశ్వాసం కలిగించాడు. అనంతరం మారుతి సుజుకి డిజైర్ కారు (ఏపీ 39 ఎన్టీ 8616)ను రోజువారీ అద్దెకు తీసుకుని తిరిగి ఇవ్వకుండా వివిధ ప్రాంతాల్లో వినియోగించినట్లు దర్యాప్తులో తేలింది.
విచారణలో అనంతపురం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ ఇదే తరహాలో మరికొందరిని మోసం చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. అతని వద్ద నుంచి కారుతో పాటు మోసానికి ఉపయోగించిన పోలీసు యూనిఫాంను స్వాధీనం చేసుకున్నారు.
ఎస్డీపీవో పి. రవిబాబు ఆదేశాల మేరకు సీఐ పి. గణేష్ ఆధ్వర్యంలో కేసును వేగంగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా దర్యాప్తులో పాల్గొన్న పోలీసు సిబ్బందిని ఎస్డీపీవో అభినందించారు.










