కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్, జూన్ 11: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణతో పాటు గ్రామాల్లో తాగునీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కే హరిత ఐఏఎస్ గారు అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ నుండి వివిధ శాఖల అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ (VC) ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ద్వారా రోజువారీగా తాగునీరు అందేలా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. ఎక్కడా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
అలాగే, భూగర్భ జలాల పెంపునకు దోహదపడే ఇంకుడు గుంతల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో గుర్తించిన వివిధ అభివృద్ధి పనులను ఎక్కడా నాణ్యత లోపించకుండా, అత్యంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.










