హైదరాబాద్ : తెలంగాణలో మాన్సూన్ వర్షాల నేపథ్యంలో అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ముందస్తుగా సమీక్ష సమావేశాలు నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, వాటిని అధికారులు సక్రమంగా అమలు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూన్ 1న వర్షాల పరిస్థితులపై సమీక్ష నిర్వహించి సంబంధిత శాఖలకు పలు సూచనలు చేసినప్పటికీ, జూన్ 9న భారీ వర్షాలు కురిసిన సమయంలో అధికారులు ఆశించిన స్థాయిలో స్పందించలేదని సీఎం పేర్కొన్నారు.
ముఖ్యంగా మున్సిపల్ శాఖ, పోలీసు శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు.
వర్షాల సమయంలో క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని, సమస్యలు తలెత్తిన వెంటనే స్పందించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటి అమలులో లోపాలు కనిపించాయని సీఎం వ్యాఖ్యానించారు.
ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకాడదని హెచ్చరించారు.
వర్షాకాలంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అవసరమైతే తానే స్వయంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తానని స్పష్టం చేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నీటిమునిగిపోవడం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి ఘటనల నేపథ్యంలో సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
#Sidhumaroju










