మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 24 నుంచి జూలై 24 వరకు నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి పోలింగ్ బూత్ వద్ద బీఎల్ఏలతో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు.
వార్డు నంబర్-2లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ..ఓటరు జాబితా సవరణ ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఇప్పటికే ఓటరుగా ఉన్నవారు తమ పేరు జాబితాలో ఉందో లేదో స్వయంగా పరిశీలించుకోవాలని సూచించారు. పేర్లు లేకపోయినా, వివరాల్లో పొరపాట్లు ఉన్నా వెంటనే సరిచేయించుకోవాలని కోరారు.
ఓటర్లు అప్రమత్తంగా లేకపోతే ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని, భవిష్యత్తులో పలు పరిపాలనా, సంక్షేమ అంశాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున బీఎల్ఏలు నెల రోజుల పాటు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పిస్తారని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ వివరాలను ధృవీకరించుకోవాలని సూచించారు. బీఎల్ఏలను ఉద్దేశించి మాట్లాడుతూ అత్యంత బాధ్యతతో విధులు నిర్వహించాలని, ఒక్క అర్హుడి ఓటు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్‌ఐఆర్ కో-ఆర్డినేటర్లు బద్రీనాథ్ యాదవ్, సంకి రవీందర్, వార్డు-2 కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ ప్రతినిధులు, కార్యకర్తలు, బీఎల్ఏలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#Sidhumaroju










