“”అరైవ్ అలైవ్”.. చిన్నారులకు ట్రాఫిక్ భద్రత పాఠాలు.|

0
0

“ఆల్వాల్ కిడ్జ్ స్కూల్‌లో ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమం.. మైనర్ డ్రైవింగ్, అతివేగంపై హెచ్చరికలు.”

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : రోడ్డు ప్రమాదాల నివారణకు చిన్న వయస్సు నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మల్కాజిగిరి పోలీసులు చేపట్టిన “అరైవ్ అలైవ్” కార్యక్రమానికి ఆల్వాల్‌లో విశేష స్పందన లభించింది.

మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, IPS ఆదేశాలు, ట్రాఫిక్-1 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె. రాహుల్ రెడ్డి, IPS మార్గదర్శకత్వంలో సోమవారం ఆల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిడ్జ్ స్కూల్లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు భద్రత ప్రాముఖ్యతను వివరిస్తూ, అతివేగంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగించడం వంటి ప్రమాదకర అలవాట్ల వల్ల సంభవించే దుష్పరిణామాలను ట్రాఫిక్ పోలీసులు వివరించారు.

ముఖ్యంగా 18 ఏళ్లలోపు మైనర్లు వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని, సరైన వయస్సు వచ్చిన తర్వాత చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారే వాహనాలు నడపాలని విద్యార్థులకు స్పష్టంగా తెలియజేశారు.

అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీటుబెల్ట్ వినియోగించాలని సూచించారు. ట్రాఫిక్ సిగ్నళ్లను గౌరవించడం, లేన్ క్రమశిక్షణ పాటించడం, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించడం ద్వారా అనేక రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని వివరించారు.

కార్యక్రమంలో తిరుమల్ గిరి డివిజన్ ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జి. శంకర్ రాజు, ఆల్వాల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జి. పవన్ కుమార్, అదనపు ఇన్‌స్పెక్టర్ పి. హరి లాల్, సబ్-ఇన్‌స్పెక్టర్ కిషోర్, కిడ్జ్ స్కూల్ కరస్పాండెంట్ రవి రాజ్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

కార్యక్రమం అనంతరం విద్యార్థులు ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతకు సంబంధించిన పలు సందేహాలను పోలీసు అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు.

ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం అభినందించగా, కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

#Sidhumaroju

Alwal