శాయంపేట మండలంలోని చలివాగు ప్రాజెక్టును కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతిపక్షాల కుట్రలకు రైతులు బలి కావొద్దని సూచించారు. ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన కరువును రేవంత్ రెడ్డికి ఆపాదించడం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అవివేకమన్నారు. రైతులపై చిత్తశుద్ధి ఉంటే తన భూములకు క్రాప్ హాలిడే ప్రకటించి పేద రైతులకు ఆ నీరివ్వాలని డిమాండ్ చేశారు. చలివాగు గేట్లు తానే ఎత్తుతానని రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడే హక్కు ఆయనకు ఎక్కడిదని ప్రశ్నించారు. చలివాగు ఆయకట్టు రైతుల సూచనల మేరకే తుది నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వానికి తాగునీటికే తొలి ప్రాధాన్యత ఉంటుందని, ఆ తర్వాతే సాగునీరు అందిస్తామన్నారు. నీటి కొరత దృష్ట్యా రైతులు ఆరుతడి పంటల వైపు మళ్లాలని, అప్పటికే వేసిన పంటలకు తప్పకుండా సాగునీరు అందిస్తామని బుచ్చిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.










