కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమ్ముగూడ గ్రామానికి చెందిన చునార్కర్ దుర్యోధన్ అనే వ్యక్తి విధుల్లో ఉన్న అటవీ శాఖ (Forest Department) ఉద్యోగిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. అటవీ అధికారుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా దాడికి తెగబడటంతో స్థానిక బీట్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన సిర్పూర్ (టి) ఎస్ఐ డి. సాగర్ కేసు నమోదు చేసి నిందితుడు దుర్యోధన్ను అరెస్ట్ చేశారు. అనంతరం శనివారం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా ఎస్ఐ సాగర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించినా, వారిపై దాడులకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.










