“ప్రభుత్వ భూముల పరిరక్షణ, పేదలకు న్యాయం చేయాలని వినతి”
మేడ్చల్ మల్కాజ్ గిరి : మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా అల్వాల్‌లో ఫైర్ స్టేషన్ నిర్మాణానికి కేటాయించిన గ్రామకంఠం భూమిపై కొనసాగుతున్న కోర్టు స్టే అంశాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
ప్రజల భద్రత దృష్ట్యా ఫైర్ స్టేషన్ నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అదే గ్రామకంఠం ప్రాంతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసిన అధికారులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అల్వాల్ జొన్నబండ పరిధిలోని యూఎల్సీ భూములు, సర్వే నంబర్లు 582, 583లో 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు.
అదే ప్రాంతంలో నివసిస్తున్న వడ్డెర, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పేద కుటుంబాలకు జారీ అవుతున్న నోటీసుల అంశాన్ని కూడా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, నిరుపేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, మల్కాజ్‌గిరి నియోజకవర్గ ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అభివృద్ధి పనుల వేగవంతమైన అమలే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ కృషి కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే సమర్పించిన వినతులపై హైడ్రా కమిషనర్ సానుకూలంగా స్పందించి, సంబంధిత అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
#Sidhumaroju
Alwal










