కలెక్టర్, ఎమ్మెల్యేలతో ప్రభుత్వ ఆసుపత్రి సేవలపై ఆదిలాబాద్ ఎంపీ సమీక్ష

0
1

ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్): కుమురం భీం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు నమ్మకమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేశ్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ (HDCS) సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ హరిత, స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మిలతో కలిసి ఆసుపత్రిలో అందుతున్న సేవలు, వసతులపై ఎంపీ సుదీర్ఘంగా సమీక్షించారు.ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది మానవత్వంతో, మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. విధుల్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితమైన సమయపాలన పాటించాలన్నారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా బ్లడ్ బ్యాంక్, అంబులెన్స్ సేవలను నిరంతరం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

వీటితో పాటు ఎక్స్రే, స్కానింగ్ వంటి కీలకమైన వైద్య పరికరాలు ఎల్లప్పుడూ పని చేసేలా చూడాలని, పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ వైద్యం అందడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన అధికారులను కోరారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, కమిటీ సభ్యులు మరియు ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.