ఒవైసీ విద్యాసంస్థకు అనుమతుల్లేవ్‌|

0
1

హైదరాబాద్‌ జిల్లా

‎బండ్లగూడలోని సల్కం చెరువు ఎఫ్‌టీఎల్ (FTL) పరిధిలో నిర్మించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థకు ఎలాంటి అనుమతులు లేవని పాఠశాల విద్యాశాఖ హైకోర్టుకు స్పష్టం చేసింది. అనుమతి లేని ఈ కాలేజీ విద్యార్థులకు హాల్‌టికెట్లు, సర్టిఫికెట్లు ఎలా వస్తున్నాయని న్యాయస్థానం ప్రశ్నించగా.. అనుమతి ఉన్న ఇతర కాలేజీల్లో అడ్మిషన్లు పొంది, ఇక్కడ చదువుకుంటున్నారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీనిపై ధర్మాసనం తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భవన నిర్మాణ అనుమతులు, ఎఫ్‌టీఎల్ నిర్ధారణ తదితర అంశాలపై వివరణ ఇవ్వడంలో జీహెచ్‌ఎంసీ, ఇతర ప్రభుత్వ శాఖలు విఫలం కావడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయడానికి ఆయా శాఖలకు చివరి అవకాశంగా వారం రోజుల గడువు ఇచ్చింది. లేనిపక్షంలో అందుబాటులో ఉన్న సమాచారంతోనే తుది ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు హెచ్చరించింది.