కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అంకుసాపూర్ శివారులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 200 కోట్లతో నిర్మించతలపెట్టిన మోడల్ ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను స్థానిక రైతులు తీవ్రంగా అడ్డుకున్నారు. పాఠశాల నిర్మాణం కోసం కేటాయించిన 87వ సర్వే నంబర్ పరిధిలోని భూమి ప్రభుత్వానిది కాదని, తరతరాలుగా తాము సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని వారు ఆందోళనకు దిగారు. నిర్మాణ సామాగ్రిని, కంటైనర్లను ఏర్పాటు చేయనివ్వకుండా నిలిపివేశారు.
సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్‌తో రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ క్రమంలో తమకున్న ఏకైక జీవనాధారమైన సాగు భూమిని లాక్కోవద్దంటూ ఒక రైతు ఏడుస్తూ తహసీల్దార్ కాళ్లు పట్టుకుని ప్రాధేయపడటం అందరినీ కలచివేసింది. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సాగు భూములను కాపాడాలని రైతులు డిమాండ్ చేస్తుండటంతో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది.










