గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన 197 ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుపై బాధ్యతాయుతంగా, పారదర్శకంగా విచారణ జరిపి, నిర్దేశిత గడువులోగా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదు పరిష్కారం అనంతరం బాధితులకు సమాచారం అందించి వారి సంతృప్తిని నిర్ధారించుకోవాలని స్పష్టం చేశారు. ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టేలా పోలీస్ అధికారులు సేవాభావంతో విధులు నిర్వహించాలని కోరారు. అలాగే, దూర ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం సాయినగర్ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని ఎస్పీ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం కృషి చేస్తోందని ఎస్పీ తెలిపారు.










