“గోల్కొండ అమ్మవారికి బోనం ఎత్తిన ఈటల రాజేందర్”.|

0
11

“బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక.. వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక వేడుక: ఈటల”

హైదరాబాద్. గోల్కొండ జూలై 16: ఆషాఢ మాసం బోనాల పండుగ ప్రారంభోత్సవం సందర్భంగా తొలి రోజు గురువారం గోల్కొండ కోటలోని శ్రీశ్రీశ్రీ జగదంబ మహంకాళి అమ్మవారిని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. వందల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక సంప్రదాయం తెలంగాణ ప్రజల విశ్వాసానికి ప్రతిబింబమని పేర్కొన్నారు.

“వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి బోనాన్ని గోల్కొండ అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అనంతరం లష్కర్ బోనాలతో పాటు హైదరాబాద్ నగరంలోని ప్రతి గల్లీలో, ప్రతి ఇంట్లో బోనాలు సమర్పిస్తారు. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోనూ బోనాల వేడుకలు నిర్వహిస్తారు” అని ఈటల రాజేందర్ తెలిపారు.

ప్రజలు అమ్మవారిని దర్శించుకుని కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, అందరినీ చల్లగా చూడాలని మొక్కుకుంటారని ఆయన అన్నారు. భూతల్లి, వ్యవసాయం, వ్యాపారాలు సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి తెలంగాణ పాడిపంటలతో అభివృద్ధి చెందాలని ప్రజలు కోరుకుంటారని తెలిపారు.

తరతరాలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అందించడంలో గోల్కొండ బోనాల జాతర కీలక పాత్ర పోషిస్తోందని ఈటల రాజేందర్ అన్నారు.

ప్రతి సంవత్సరం కమిటీ ఆధ్వర్యంలో కుమ్మర సోదరులు, వివిధ వర్గాల ప్రజలు కలిసి ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆయన బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

#Sidhumaroju