ఫిరంగిపురంలో నకిలీ నోట్ల కేసు ఛేదింపు: ముగ్గురు అరెస్ట్|

0
0

నకిలీ నోట్ల కేసును ఛేదించిన టాస్క్ ఫోర్స్, ఫిరంగిపురం పోలీసులు – ముగ్గురు నిందితులు అరెస్ట్

గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 18న నమోదైన నకిలీ కరెన్సీ నోట్ల కేసును టాస్క్ ఫోర్స్, ఫిరంగిపురం పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ముగ్గురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి నకిలీ కరెన్సీ నోట్లు, వాటి తయారీకి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

ఫిరంగిపురం సీఐ భుజంగరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం దర్యాప్తు చేపట్టి ప్రకాశం జిల్లా కురిచేడు మండలం వాళపాడు గ్రామానికి చెందిన గంధం రామాంజనేయులు (37), గుంటూరు నిరుపేదలపేటకు చెందిన ఓర్సు వెంకట రాములు (42), ఓర్సు బాలకృష్ణ (25)లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసింది.

నిందితుల వద్ద నుంచి రూ.500 విలువ కలిగిన 53 నకిలీ కరెన్సీ నోట్లు, నకిలీ నోట్లు తయారీకి ఉపయోగించే ప్రాథమిక పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టు చేసిన నిందితులను నరసరావుపేట కోర్టులో హాజరుపరచగా, కోర్టు వారిని జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.

గుంటూరు జిల్లా పోలీసులు నకిలీ కరెన్సీ చలామణి, తయారీ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై నిరంతరం నిఘా ఉంచి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా పోలీసులు హెచ్చరించారు.