మంచిర్యాలలోని పూలె భవనంలో సీఐటీయు, రైతు, వ్యవసాయ కార్మిక, ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గురువారం జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్స్, వ్యవసాయ దిగుమతుల విధానం, ఉపాధి హామీ చట్టం పేరు మార్పుతో పాటు నిధుల కోత, విద్యుత్ సవరణ బిల్లు-2025 వంటి చర్యలు పూర్తిగా కార్పొరేట్లకు మేలు చేసేలా, పేదలకు నష్టం కలిగించేలా ఉన్నాయని నాయకులు తీవ్రంగా విమర్శించారు. రైతులు, కార్మికుల హక్కులను హరిస్తున్న ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విధానాలను తిప్పికొట్టేందుకు, దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఆగస్టు 10న తలపెట్టిన ‘జైల్ భరో’ కార్యక్రమాన్ని భారీ ఎత్తున విజయవంతం చేయాలని నాయకులు దుంపల రంజిత్ కుమార్, గోమాస ప్రకాష్ తదితరులు పిలుపునిచ్చారు.










