ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థను ఆధునిక సాంకేతికతతో పటిష్ఠం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా విజయవాడ పోలీసులు రూపొందించిన ‘ఏపీ అస్త్రం’ మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. విజయవాడలోని అంబేడ్కర్ కళా వేదికలో మూడు రోజుల పాటు జరిగిన ‘ఏపీ పోలీస్ రిట్రీట్-2026: ఫ్యూచర్ పోలీసింగ్’ కాన్ఫరెన్స్ ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల స్వరూపం, నేరస్థుల పద్ధతులు పూర్తిగా మారిపోయాయని, ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీసింగ్‌లో టెక్నాలజీ వినియోగం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. కేవలం టెక్నాలజీని అందిపుచ్చుకోవడమే కాకుండా, పోలీసు వ్యవస్థ నిర్మాణాన్నే పునః సమీక్షించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.
భవిష్యత్ పోలీసింగ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజిటల్ లిటరసీ ఆధారంగా నిర్మించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని చంద్రబాబు ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. 2001లోనే తాను ఫ్యూచర్ పోలీసింగ్ వర్క్‌షాప్ నిర్వహించిన విషయాన్ని గుర్తుచేస్తూ, అప్పటితో పోలిస్తే నేడు సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం, విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు పెరిగాయన్నారు. వీటిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పోలీసు వ్యవస్థ పెంపొందించుకోవాలని సూచించారు.










