హుజూర్నగర్, జూలై 27:
హుజూర్నగర్ పరిధిలో వ్యవసాయ కళాశాల నిర్మాణం కోసం 1041 సర్వే నంబరులో భూములు కోల్పోయిన నిర్వాసిత రైతులు తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. భూములు కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇళ్లు, మగ్దుమ్నగర్ గ్రామానికి శ్మశానవాటిక ఏర్పాటు చేయాలని వారు ఆర్డీవోను కోరారు. అలాగే, మొదటి విడత భూసేకరణకు ఎకరాకు ₹24 లక్షలు, రెండో విడతకు ₹27 లక్షలు చెల్లించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ పరిహారంలో వ్యత్యాసాన్ని సరిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. అయితే అర్హులకే ఇళ్లు మంజూరు చేస్తామని, పరిహారం మార్పు సాధ్యం కాదని ఆర్డీవో తెలపడంతో ఆగ్రహించిన రైతులు కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.










