ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్ల తొలి ప్రాధాన్యతగా మారిందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. బ్రూక్‌ఫీల్డ్, బ్లాక్‌స్టోన్, బ్లాక్‌రాక్, ఈక్యూటీ, టీపీజీ వంటి ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్‌లు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయని, టాటా పవర్, సుజ్లాన్, రెన్యూ, ప్రీమియర్ ఎనర్జీస్, ఏసీఎంఈ, వారీ వంటి ప్రముఖ భారతీయ దిగ్గజ సంస్థల తమ కార్యకలాపాలను ఇక్కడ విస్తరిస్తున్నాయని ఆయన వెల్లడించారు. పత్తికొండ సమీపంలోని హోసూరు వద్ద టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (టీపీఆర్ఈఎల్) ఆధ్వర్యంలో రూ.5,350 కోట్లతో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు గురువారం మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, గత ఏడాదితో పోలిస్తే ఈ ఒక్క ఏడాదిలోనే ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 400 శాతం పెరిగిందని, రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న విశ్వసనీయత వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు.










