తిరుమల కొండపై మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. నిన్న అర్ధరాత్రి వేళ తిరుమలలోని జీఎన్సీ (GNC) టోల్‌గేట్‌కు సమీపంలోని నడకదారి వద్ద ఓ చిరుతపులి ప్రత్యక్షమైంది. రహదారి పరిసరాల్లో కొద్దిసేపు చిరుత సంచరిస్తుండటాన్ని స్థానికులు, భద్రతా సిబ్బంది గమనించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన టీటీడీ భద్రతా సిబ్బంది పరిస్థితిని పర్యవేక్షించారు.
అదే సమయంలో నడకదారిలో భక్తుల రాకపోకలు తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కొద్దిసేపు టోల్గేట్ పరిసరాల్లోనే సంచరించిన చిరుత అనంతరం అక్కడి నుంచి సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. దీంతో భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
అయితే భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతానికి అత్యంత సమీపంలో చిరుత కనిపించడంతో కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలోనూ తిరుమల ఘాట్ రోడ్లు, నడకదారుల పరిసరాల్లో చిరుతలు సంచరించిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో రాత్రి వేళల్లో నడకదారులపై ప్రయాణించే భక్తులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భక్తులు ఒంటరిగా కాకుండా గుంపులుగా ప్రయాణించాలని, అటవీ ప్రాంతాల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని టీటీడీ అటవీ, భద్రతా సిబ్బంది విజ్ఞప్తి చేశారు.
తిరుమలలో చిరుతల సంచారం నేపథ్యంలో భక్తుల భద్రత కోసం అధికారులు నిఘాను మరింత పెంచాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు.









